జర్నలిస్ట్ ప్రభుకు కోర్టులో న్యాయం. డైరెక్టర్స్ అసోషియేషన్ ఎన్నికల్లో అర్హత

మా ఎన్నికల  సందర్భంగా జరిగిన రచ్చను, రసాభాసను మర్చిపోకముందే ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో  మరో ఎన్నికల వివాదం రాజుకుంటుంది. నవంబర్ 14న జరగనున్న "తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం" ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న
టి వి ఆర్ చౌదరి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఇద్దరు సభ్యుల నామినేషన్స్ ను  తిరస్కరించడం చిత్ర పరిశ్రమలో  వివాదానికి,తీవ్ర చర్చకు దారి తీసింది.

ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టు, దర్శకుడు ప్రభు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నకారణంగా చలనచిత్ర దర్శకుల సంఘంలో పోటీ చేయడానికి వీలులేదు అంటూ ఆయన నామినేషన్ ను తిరస్కరించడం చర్చనీయాంశమైంది. చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ లో  ఏదైనా అసోసియేషన్  పదవిలో ఉన్నట్లయితే దర్శకుల సంఘంలో పోటీ చేయకూడదు అనే నిబంధన ఉంది అనే సాకుతో తన నామినేషన్ ను  రిటర్నింగ్ అధికారి చౌదరి తిరస్కరించటాన్ని దర్శక, పాత్రికేయుడు ప్రభు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు అలాంటి నిబంధన ఏదీ అసోసియేషన్  బైలాలో లేకపోయినప్పటికీ ఎన్నికల అధికారి చౌదరి కొందరు వ్యక్తుల వత్తిడికి తలవోగ్గి  ఉద్దేశ్యపూర్వకంగానే తన నామినేషన్ ను తిరస్కరించారన్నది ప్రభు ఆరోపణ.

తమ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం వెనుక కొందరు సినీ పెద్దల హస్తం ఉందని,  మినిట్స్ బుక్  లోని రిసొల్యుషన్స్ ను తారుమారు చేసి అక్రమాలకు పాల్పడిన గత కమిటీకి    రిటర్నింగ్ ఆఫీసర్ చౌదరి కొమ్ముకాస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ అలా న్యాయ పోరాటానికి సిద్ధమైన విషయం తెలిసిందే .

కాగా ఈ విషయంలో  హైకోర్టు ను ఆశ్రయించిన జర్నలిస్టు ప్రభు న్యాయం జరిగింది. ఉన్నత న్యాయస్థానం లో ఆయన వేసిన రిట్  పిటిషన్ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ప్రభు అభ్యర్థిత్వాన్ని  తిరస్కరించడానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఆయన నామినేషన్ ను  అనుమతించింది.

ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ " న్యాయస్థానం ఈ రోజున ఇచ్చిన తీర్పు చాలా చారిత్రాత్మకమైనది. ఇది దర్శకుల సంఘంలో కొందరు వ్యక్తులు చేస్తున్న అప్రజాస్వామిక వ్యవహారాలకు  చెంపపెట్టు. నాకు ప్రచార  వ్యవధి లేకుండా చేయటం తప్ప ఈ తప్పుడు నిర్ణయం వల్ల ఆ వ్యక్తులు సాధించింది  ఏమీ లేదు. ఈ కొద్ది వ్యవధిలోనే తీవ్ర స్థాయిలో ప్రచారం చేసి అభ్యర్థుల సభ్యుల అభిమానంతో అత్యధిక మెజార్టీతో గెలవగలనన్న నమ్మకం నాకుంది" అన్నారు  జర్నలిస్ట్ ప్రభు. అలాగే కోర్టును ఆశ్రయించిన మరో అభ్యర్థి, సీనియర్ దర్శకుడు మద్దినేని రమేష్ కు కూడా అనుకూలంగా కోర్టు తీర్పు రావటం విశేషం. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఎలా జరుగుతుంది..   ఇంత తక్కువ వ్యవధిలో ఎన్నికల నిర్వహణ జరగటంపై  దర్శకుల సంఘంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా హై కోర్టులో జనలిస్ట్ ప్రభు తరుఫున యువ న్యాయవాది  , గీత రచయిత  జక్కుల లక్ష్మణ్  ఈ కేసులో  తమ వాదనలు  కోర్టుకు వినిపించారు.

No comments