50 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో 'మా' సభ్యులకు, మీడియాకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన డా. ఎం. మోహన్ బాబు

సినీ ప్రపంచంలో నటుడిగా, నిర్మాతగా యాభై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న అతికొద్ది మంది గొప్ప వ్యక్తుల్లో డా. ఎం. మోహన్ బాబు ఒకరిగా నిలిచారు. నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, పద్మశ్రీ డాక్టర్ ఎం. మోహన్ బాబు చిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాకు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు గ్రాండ్ పార్టీని ఇచ్చారు.

తెలుగు సినిమా చరిత్రలో మోహన్ బాబు గారికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, గొప్ప విద్యావేత్త, ఎన్నో క్లాసిక్ చిత్రాల్ని నిర్మించిన వ్యక్తిగా, ఎన్నో వందల చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్ని పోషించిన నటుడిగా మోహన్ బాబు తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. ఆయన క్రమశిక్షణ, సినిమా పట్ల ఆయనకుండే అంకితభావం, నిబద్దత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తన యాభై ఏళ్ల సినీ ప్రయాణం, ఈ స్మారక మైలురాయిని మరింత అందమైన జ్ఞాపకంగా మార్చుకునేందుకు ఆదివారం నాడు మీడియా సోదరులకు, మా (MAA) అసోసియేషన్ సభ్యులకు విలాసవంతమైన విందు సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమం కృతజ్ఞత, వేడుకలతో నిండిపోయింది. అతిథులను అసాధారణమైన ఆతిథ్యంతో స్వాగతించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని మీడియా మిత్రులతో పంచుకోవడంతో మోహన్ బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అపూర్వమైన కార్యక్రమంలో తమను కూడా భాగస్వామ్యం చేయడంపై మీడియా, మా సభ్యులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇక నవంబర్ 22, 2025న "MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్" అనే ఓ గ్రాండ్ ట్రిబ్యూట్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. మోహన్ బాబు కుమారుడు నటుడు-నిర్మాత విష్ణు మంచు ఈ ఈవెంట్‌ను ఎంతో గొప్పగా నిర్వహించబోతోన్నారు. మోహన్ బాబు సాధించిన విజయాలు, సినీ ఇండస్ట్రీలోని ఆయన అద్భుతమైన ప్రయాణం, ఆయన స్థాయి, గౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోన్నారు. దేశవ్యాప్తంగా వివిధ చలనచిత్ర పరిశ్రమల నుండి ప్రముఖ వ్యక్తులు హాజరు కానున్నారు. తారలన్నీ ఒకే చోట చేరే ఈవెంట్‌గా మారనుంది.

గత ఐదు దశాబ్దాలుగా మోహన్ బాబు తన నటన, క్రమశిక్షణ, తెరపై అద్భుతమైన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 600కి పైగా చిత్రాలతో మెప్పించిన ఆయన.. అంకితభావం, క్రమశిక్షణకు శాశ్వత చిహ్నంగా నిలుస్తారు. ఆయన ప్రభావం తరతరాలుగా నటులు, చిత్రనిర్మాతలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. మోహన్ బాబు గారిని అందరూ ఒక మాస్టర్ క్రాఫ్ట్‌మ్యాన్‌గా భావిస్తారు. 

MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్ ఒక అద్భుతమైన వేడుకగా ఉండబోతోంది. ఒక లెజెండరీ వ్యక్తికి సరైన ట్రిబ్యూట్‌గా ఈ ఈవెంట్ నిలుస్తుంది.

No comments