ప్రేక్షకుల డబ్బుకి, సమయానికి, విజ్ఞతకి పెద్ద పీఠ వేసేలా ఉంటుంది.. ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్
భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో గురువారం గ్రాండ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో..
సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ మాట్లాడుతూ .. ‘1992లో ‘లాఠీ’ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇది నా 14వ సినిమా. నా మొదటి చిత్రానికి ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు కూడా అదే ఫీల్‌తో ఉన్నాను. ఓ మంచి కథను, కొత్త కథను మరింత కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాను. నేను ప్రేక్షకుల దేవుళ్లని నమ్ముతాను. నేను వారి టైంకి, డబ్బుకి, విజ్ఞతకి విలువ ఇస్తాను. నేను వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ ‘యుఫోరియా’ మూవీని తెరకెక్కించాను. నేను ప్రేక్షకుల డబ్బుని, సమయాన్ని వృథా చేయను. ప్రేక్షకుల విజ్ఞతకి పెద్ద పీఠ వేసేలా ఈ మూవీని రూపొందించాను. ‘యుఫోరియా’ ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. సినిమా చూసిన వారంతా కూడా ‘ఏంటండి.. అంత డబ్బులు పెట్టేశారు.. ఇలాంటి కథను ఇంత గొప్పగా, ఇంత భారీ బడ్జెట్‌తో, కొత్త వారితో చేయడం అంటే మామూలు విషయం కాదు’ అని అన్నారు. ఇదొక ఫ్యామిలీ ప్రొడక్ట్‌లా తీశారని చాలా మంది మెచ్చుకున్నారు. ఈ కథకు సారా అర్జున్ ఆత్మ. ఆమె ఒప్పుకుంటేనే మూవీ తీయాలని అనుకున్నాను. సినిమా చూశాక ఆ విషయం ఆడియెన్స్‌కి అర్థం అవుతుంది. ఈ సినిమాకి భూమిక బ్యాక్ బోన్. ఆమె చాలా స్ట్రాంగ్ పర్సన్. కానీ ఆమె ఇలా ఎమోషనల్ అవ్వడం ఇదే మొదటిసారి. ఆమెను నేను ఇలా చూడటం కూడా ఇదే మొదటిసారి. వింధ్య వేములపల్లి పాత్రలో ఆమె జీవించారు. విఘ్నేశ్ ఈ సినిమాకి బ్రెయిన్ లాంటివాడు. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ మూవీ ఉందని చూసిన వారంతా ప్రశంసించారు. పృథ్వీ సైతం పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించాడు. స్పాయిల్ కిడ్స్‌ని చూపించేలా రూపొందించిన పాత్రలో లిఖిత గొప్పగా నటించారు. అడాల్‌సెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్ అనే అంశాలతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. నా మేధస్సుని ఉపయోగించి కాకుండా ఓ సాధారణ వ్యక్తిలా సమాజాన్ని చూసిన వ్యక్తిగా ఈ మూవీని తీశాను. తెలుగు టైటిల్ పెట్టనందుకు నన్ను క్షమించండి. సినిమా చూసిన తరువాత ‘యుఫోరియా’ టైటిల్ కరెక్ట్‌గా సెట్ అయిందని అంటారంతా. సమాజంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథను అల్లుకున్నాను. ప్రవీణ్ కెమెరా వర్క్ చాలా కొత్తగా ఉంటుంది. కాళ భైరవ బీజీఎం అదిరిపోతుంది. తండ్రికి తగ్గ తనయుడు అని కాళ భైరవ నిరూపించుకుంటాడు. టీం అంతా కూడా ప్రాణం పెట్టి పని చేసింది. ‘యుఫోరియా’కి పని చేసిన వారందరికీ మంచి పేరు వస్తుంది. మేం కుటుంబ సమేతంగా ఈ మూవీని నిర్మించాం. ఈ చిత్రాన్ని యూత్, పేరెంట్స్ ఇలా అందరూ వీక్షిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
భూమిక మాట్లాడుతూ .. ‘‘యుఫోరియా’ లాంటి చిత్రాలను చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇలాంటి చిత్రాల్లో రిస్క్ ఎంతో ఉంటుంది. కానీ గుణ శేఖర్ గారు, ఆయన ఫ్యామిలీ కలిసి రిస్క్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ ఈ మూవీని చూశాను. సినిమా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను. రాత్రంతా ఈ మూవీ నన్ను వెంటాడుతూనే ఉంది. పృథ్వీ, లిఖిత, విఘ్నేశ్ అందరూ అద్భుతంగా నటించారు. ఇన్నేళ్ల కెరీర్ అయినా కూడా ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని నమ్ముతాను. ఫిబ్రవరి 6న ఈ మూవీని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ .. ‘‘యుఫోరియా’ అనేది సందేశాత్మక చిత్రమేమో అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ మూవీని చూసిన వారంతా కూడా కొత్త కథకు కమర్షియల్ అంశాల్ని జోడించి కొత్తగా తీశారని మెచ్చుకున్నారు. సినిమా చూసిన తరువాత భూమిక గారి పాత్రకి చాలా కనెక్ట్ అయ్యాను. ఆమె కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రంగా ‘యుఫోరియా’ నిలుస్తుంది. సారా ఈ సినిమాకి సోల్. లిఖిత, విఘ్నేశ్, పృథ్వీ అందరూ అద్భుతంగా నటించారు. కెమెరామెన్ ప్రవీణ్, కాళ భైరవ, ఎడిటర్ ప్రవీణ్ పూడి అందరి సపోర్ట్‌తో ఈ మూవీని ఇక్కడి వరకు తీసుకు వచ్చాం. ‘యుఫోరియా’ అందరి మనసుల్ని తాకుతుందని భావిస్తున్నాను. ఫిబ్రవరి 6న ఈ మూవీని ఆడియెన్స్ చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను’ అని అన్నారు.
నటి లిఖిత మాట్లాడుతూ .. ‘ఎంబీబీఎస్ చదువుకుంటూనే మోడలింగ్ చేశాను. ఫెమినా మిస్ ఇండియా టైటిల్ కూడా గెల్చుకున్నాను. కానీ సినిమాలు అంటే మాత్రం ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ గుణ శేఖర్ గారి పేరు చెప్పి ఇంట్లో ఒప్పించాను. ‘యుఫోరియా’లాంటి చిత్రంలో అద్భుతమైన పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. భూమిక, గౌతమ్ మీనన్ గార్లతో నటించడం ఆనందంగా ఉంది. అమృత అనే పాత్రని నేను పోషించాను. ఇందులో చాలా సర్ ప్రైజ్‌లు ఉంటాయి. ఈ మూవీ ఆడియెన్స్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నటుడు విఘ్నేశ్ మాట్లాడుతూ .. ‘‘యుఫోరియా’ ప్రీమియర్‌ని మా అమ్మనాన్న కూడా చూశారు. సినిమా చూసి మా అమ్మనాన్నలు ఎంతో గర్వపడ్డారు. అదే నాకు పెద్ద సక్సెస్. గుణ శేఖర్ గారితో పని చేస్తున్నాను అని చెప్పడంతో నా ఫ్రెండ్స్, బంధువుల్లో చాలా గౌరవం పెరిగింది. ఫిబ్రవరి 6న ఈ మూవీని చూడండి. అందరికీ ఈ చిత్రం నచ్చుతుంది’ అని అన్నారు.
నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ‘‘యుఫోరియా’ ప్రీమియర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. నాకు ఓ కొత్త గుణ శేఖర్ కనిపించారు. నేను ఎప్పుడో తెరకు పరిచయం కావాల్సింది. కానీ గుణ శేఖర్ లాంటి దర్శకుడి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం ఆనందంగా ఉంది. నీలిమ, యుక్తా, రాగిణి గారి లాంటి వారే ఈ మూవీని నిర్మించగలరు. ప్రతీ ఒక్కరి పర్ఫామెన్స్ చూసి నేను కూడా కంటతడి పెట్టుకున్నాను. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

No comments