కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు బర్త్ డే స్పెషల్

నేడు (మార్చి 19) టాలీవుడ్ సీనియ‌ర్, లెజెండరీ న‌టుడు కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు పుట్టిన రోజు. సినీ పరిశ్రమలో ఆయన అడుగు పెట్టి ఇటీవలే యాభై ఏళ్లు అయిన సంగతి తెలిసిందే.  ఇక విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, నటుడిగా మంచు మోహన్ బాబు అందుకున్న శిఖరాగ్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1975లో సినీ కెరీర్‌‌ను ఆరంభించిన మోహన్ బాబు ఇప్పటికీ దిగ్విజయంగా దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలు, యంగ్ జనరేషన్‌తో పోటీ పడుతూ మరీ మోహన్ బాబు నటిస్తున్నారు. ఒకప్పుడు విలన్‌గా తెలుగు సినీ పరిశ్రమకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన మోహన్ బాబు ఇప్పుడు డిఫరెంట్ పాత్రలతో నేటి తరాన్ని మెప్పించబోతోన్నారు.

‘స్వర్గం నరకం’ చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారు. ఆ తరువాత ఎన్నెన్నో గొప్ప పాత్రలు పోషించారు. అటు విలన్‌గా, ఇటు హీరోగా, మరో పక్క నిర్మాతగా తిరుగులేని విజయాల్ని అందుకున్నారు. ఆయన కెరీర్‌లో కల్ట్ క్లాసిక్స్, ఇండస్ట్రీ హిట్స్ వంటివెన్నో ఉన్నాయి. ఇక విద్యా వేత్తగానూ మోహన్ బాబు సమాజంపై తన ముద్రను వేశారు. 1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. 2022లో ప్రారంభమైన మోహన్ బాబు యూనివర్సిటీ ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందింది. ఎంతో మంది పేద పిల్లలకు స్కాలర్ షిప్స్ అందిస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు.

మోహన్ బాబు తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో గౌరవ పురస్కారాలను అందుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేయగా, 2016 ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆయన్ను వరించింది. ఇటీవలె గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు (2026) వంటి ముఖ్యమైన పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇక గత ఏడాది మంచు వారి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా తన నటనతో అందరినీ మెప్పించారు.
 
సామాన్య వ్యక్తిగా మొదలై ఓ సామ్రాజ్యాన్ని ఏర్పర్చిన మోహన్ బాబు జీవిత ప్రయాణం ఎంతో మందికి ఆదర్శప్రాయం. సినిమా రంగంలో దశాబ్దాల పాటు సేవలు అందిస్తూ వస్తున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ 75 చిత్రాలను నిర్మించారు. ఓ నటుడు ఇలా నిర్మాతగా మారి 75 చిత్రాలు నిర్మించడం అనేది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో రికార్డ్. ఎక్కువ చిత్రాలు నిర్మించిన ఏకైక నటుడిగా ఆయన రికార్డులు నెలకొల్పారు. ఈ ఏడాది ‘ది ప్యారడైజ్’, ‘శ్రీనివాసమంగాపురం’ వంటి చిత్రాల్లో డిఫరెంట్ పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ పాత్రలు నేటి తరాన్ని ఆశ్చర్యపరిచేలా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ సినిమాలోని శికంజా మాలిక్ పాత్రలో మోహన్ బాబు లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇలానే ఆయన మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుడ్ని ప్రార్థిద్దాం.

No comments