అందరి కో ఆర్డినేషన్‌తో ‘‘మేము ‘కాప్‌’లం’’ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే షూట్ పూర్తి చేశాం- సినిమాటోగ్రాఫ‌ర్‌ కిషోర్ బోయిడాపు

ద‌ర్శ‌కుడు ఆలోచ‌న‌ను వెండితెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించే బ్ర‌హ్మ సినిమాటోగ్రాఫ‌ర్‌. అంతే కాదు.. నిర్మాత పెట్టే బ‌డ్జెట్ వేల్యూని కూడా ప‌దింత‌లు చేసి చూపించే మాయాజాలీకుడు కూడా. సినిమాకు తండ్రి నిర్మాత‌.. త‌ల్లి ద‌ర్శ‌కుడైతే.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు భుజం కాచే పెద్ద కొడుకు సినిమాటోగ్రాఫ‌ర్ అని అన‌టంలో సందేహం లేదు. 

ఇలాంటి కీల‌క శాఖ‌లో త‌న‌దైన ప్ర‌తిభ‌ను చూపిస్తున్నారు కిషోర్ బోయిడాపు. కెమెరా డిపార్ట్‌మెంట్‌లో చిన్న స్థాయి నుంచి త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించిన ఈయ‌న‌.. తెలుగు సినిమాల‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వ‌ర్క్ చేసి త‌నేంటో ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా ఈయ‌న ..నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన సిరీస్ ‘‘మేము కాప్’లం’’ సిరీస్‌తో మ‌న ముందుకు వ‌చ్చి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.  ఈ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే తెరకెక్కించ‌టంలో కీల‌క పాత్ర‌ను పోషించిన‌ కిషోర్ బోయిడాపు తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, సిరీస్‌కి సంబంధించిన ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే...

నేపథ్యం..

నా పూర్తి పేరు దుర్గ కిషోర్ కుమార్. మా ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలోనే ఉండటంతో సహజంగానే నాకు ఇంట్రెస్ట్ ఏర్పడి ఉంది. మా నాన్న గారు మమ్మల్ని ఫోటో తీసి.. ఆ ఫోటోలతోనే కథ చెప్పేవారు. అక్కడే నాకు ఈ ఫీల్డ్‌లోకి రావాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది. అలా నాకు కెమెరా మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. 


సినీ ప్రయాణం..

2002లో రవి ప్రసాద్ యూనిట్‌లో కెమెరా అసిస్టెంట్‌గా కెరీర్ స్టార్ట్ చేశా. ఓ నాలుగేళ్ల తరువాత ముంబైకి వెళ్లాను. అక్కడ మొదటి ప్రాజెక్ట్‌గా ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కి కెమెరా డిపార్ట్మెంట్‌లో పని చేశాను. ఆ తరువాత ఇంగ్లీష్ సినిమాలకి కూడా వర్క్ చేశాను. ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి 15 హాలీవుడ్ చిత్రాలకు కూడా పని చేసిన అనుభవం ఉంది. 2012లో ‘బాయ మీట్స్ గర్ల్’ అనే సినిమాకి డీఓపీగా పని చేశా. అలా చేస్తున్న టైంలో 2015 లో అనిల్ మెహతా జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. ఆ జ‌ర్నీ ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా నుంచి ప్రారంభమై, ‘జెర్సీ’ సినిమా వరకు కొనసాగింది. 

ఈ ప్రయాణంలో మధ్యలో మరో పది సినిమాల్లో కూడా వర్క్ చేసే అవకాశం వచ్చింది. సార్‌తో కలిసి వన్ ఆఫ్ ది మెయిన్ అసిస్టెంట్‌గా పని చేయడం నా కెరీర్‌లో ఎంతో ఆనందాన్ని, మంచి అనుభవాన్ని ఇచ్చింది. ఆయన దగ్గర నేర్చుకున్న ప్రతి విషయం నా సినిమాటోగ్రఫీ జర్నీలో ఎంతో ఉపయోగపడింది. ఈ జర్నీలో నేర్చుకున్న ప్రతి విషయం నాకు చాలా విలువైనది. థ్యాంక్స్ టు అనీల్ మెహ‌తా గారు. కోవిడ్ తర్వాత నాకు మై నేమ్ శృతి,105 మినిట్స్‌ వంటి సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు, నేను సార్‌తో మాట్లాడాను. అప్పుడాయాన‌..“వెళ్లి నీ సొంతంగా వ‌ర్క్ స్టార్ట్ చేయి” అంటూ ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. అలా మళ్లీ నేను కెమెరామెన్‌గా నా ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభించాను. 

సవాలుతో కూడుకున్నది..

సింగిల్ షాట్‌లో సినిమా తీయడం అనేది సవాల్‌తో కూడుకున్న పని. హన్సిక గారితో చేసిన ‘105’ సింగిల్ కారెక్టర్‌తో, సింగిల్ షాట్‌తోనే మూవీని చేశాం. ఇందులో ఉన్న శ్రమ ఆడియెన్స్‌కి అవసరం లేదు. ప్రేక్షకులకు సినిమా నచ్చిందా? లేదా? అన్నదే ముఖ్యం. కానీ సింగిల్ షాట్‌లో సినిమా తీయడం అనే దానికి వెనుకున్న కష్టం గురించి ఎవ్వరికీ తెలీదు. ఏ ఒక్క చోట మిస్టేక్ జరిగినా.. మళ్లీ మొత్తం మొదటి నుంచి చేయాల్సి వస్తుంది.

ఫిల్మ్ నుంచి డిజిటల్..

ఒకప్పుడు ఫిల్మ్‌తో షూట్ చేసేవారు. ఇప్పుడంతా డిజిటల్‌లోకి మారింది. ఇప్పుడు ఎన్ని టేకులు అయినా తీసుకుంటున్నాం. ఒకప్పుడు లెంగ్త్‌ని చూస్తూ చిత్రీకరించేవారు. ఇప్పుడు అలాంటి లిమిటేషన్స్ ఏమీ లేవు. లెన్స్ గురించి అందరూ ఇప్పుడు ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నారు. మన కథ, బడ్జెట్‌లకు తగ్గట్టుగా లెన్స్‌ను సెలెక్ట్ చేసుకుంటాం. ప్రతీ ఒక్క లెన్స్‌ని రీసెర్చ్ చేసి.. కరెక్ట్ లెన్స్‌ని సెలెక్ట్ చేసుకోవడమే పెద్ద టాస్క్. నేను ఎక్కువగా కుక్ లెన్స్‌ని వాడతాను. షణ్ముఖ్ హీరోగా రానున్న ‘ప్రేమకు నమస్కారం’ మూవీకి కుక్ 7 లెన్స్‌ని వాడాను.

వారినే ఫాలో అవుతా..

సినిమాటోగ్రఫీలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. రవి వర్మన్ గారు, అనీల్ మెహతా గారు, సుదీప్ చటర్జీ గారిని నేను ఎక్కువగా ఫాలో అవుతుంటాను. ఇదే చేయాలి అనే రూల్ అనేది ఉండదు. ఆ రోజు సీన్‌, ఆ రోజు పరిస్థితులను బట్టి మాట్ చేయాల్సి వస్తుంది. ఒత్తిడిలో కూడా కొన్ని సార్లు ఇంప్రూవ్ చేసే స్కోప్ ఉన్నా వదిలేయాల్సి వస్తుంది. మనకున్న టైమ్‌లో ఎంత బెస్ట్ ఇవ్వచ్చో అదే ముఖ్యం.

హాలీవుడ్‌కి, మనకి తేడా అదే..

హాలీవుడ్ సినిమాల్లో కలర్ టోన్ ఎక్కువగా నేచురల్‌, సాఫ్ట్‌, మరియు సినిమాటిక్‌గా ఉంటుంది. వాళ్లు రియ‌లిస్టిక్ లైటింగ్‌, కంట్రోల్డ్ క‌లరింగ్ ఉప‌యోగిస్తారు. ఇండియ‌న్ సినిమాల్లో మాత్రం వైబ్రంట్ క‌ల‌ర్స్‌, రిచ్ స్కిన్ టోన్స్‌, ఎమోష‌న‌ల్ లైటింగ్ ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ఎందుకంటే మ‌న క‌ల్చ‌ర్ ఫెస్టివ‌ల్స్‌, కాస్ట్యూమ్స్‌, వాతావ‌ర‌ణం, ఎమోష‌న్స్ ఇలా అన్నింటినీ బేస్ చేసుకుని చూస్తే మ‌న స్టోరీ టెల్లింగ్‌తో అవ‌న్నీ క‌నెక్టింగ్‌గా ఉంటాయి.  అందుక‌నే మ‌న సినిమాల్లో క‌లర్స్‌కు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. హాలీవుడ్ సినిమాలు ఏస్‌, రా, హెచ్‌డిఆర్ వంటి అడ్వాన్స్ క‌ల‌ర్ వ‌ర్క్ ఫ్లోల‌ను ఉప‌యోగిస్తాయి. ఇప్పుడు మ‌న సినిమా కూడా అదే పంథాలో ముందుకు వెళుతుంది. ముఖ్యంగా ఓటీటీ ప్రాజెక్ట్స్‌లో. సింపుల్‌గా చెప్పాలంటే హాలీవుడ్ క‌ల‌ర్స్‌ను రియలిస్టిక్‌గా చూపిస్తుంది. ఇండియ‌న్ సినిమా క‌ల‌ర్‌ను ఎమోష‌న‌ల్‌గా, క‌ల్చ‌ర‌ల్లీ రిచ్‌గా చూపిస్తుంది. 

హాలీవుడ్‌లో వాడే కలర్ టోన్ వేరు. మన కథలు వేరు, మన కల్చర్ వేరు, మన చుట్టు పక్కల ఉండే వారి కలర్స్ వేరు.. మనకు ఆ టోన్‌లో తీస్తే.. ఇక్కడి వరకు అంతగా నచ్చకపోవచ్చు. ఆ డిప్రెస్డ్ ఫీల్‌లో సినిమా తీయడం ఎందుకు. వాళ్లు,మనం సేమ్ లెన్స్ వాడతాం. కాకపోతే డీఐకి వాళ్లు ఎక్కువ టైం తీసుకుంటారు. ఇక్కడ మనకు అంత టైం ఉండదు. నాలుగైదు, లేయర్స్ చేసే వరకు సమయం అయిపోతుంది. అక్కడ స్కై బ్రైట్‌గా ఉంటే.. వీఎఫ్ఎక్స్ చేసుకుంటారు.

17 రోజుల్లోనే షూట్..

‘‘మేము కాప్’లం’’ మొత్తం షూటింగ్‌ను కేవలం 17 రోజుల్లో పూర్తి చేశాం.  మంచి ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్ వల్ల, అలాగే ప్రతి డిపార్ట్‌మెంట్ ఎంతో కష్టపడి పనిచేసినందువల్లే అది సాధ్యమైంది. ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు అందరూ తమ బెస్ట్ ఇచ్చి సజావుగా పూర్తయ్యేలా సపోర్ట్ చేశారు. ఈ ప్రయాణంలో ఎప్పుడూ క్లారిటీతో, సపోర్ట్‌తో ముందుండిన డైరెక్టర్ ప్రదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా మీద నమ్మకం ఉంచి ఈ ప్రాజెక్ట్‌కు అండగా నిలిచిన ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి గారికి, అలాగే మొత్తం ప్రొడక్షన్ టీంకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 

అలాగే నాగబాబు గారు, శ్రీను గారు, రవి గారు మరియు మొత్తం నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరి సహకారం, టీమ్‌వర్క్ వల్ల షూట్‌ను సమయానికి విజయవంతంగా పూర్తి చేయగలిగాం. రెక్కీ చేస్తున్న టైంలోనే ఏ సీన్‌ని ఎలా తీయాలి.. ఎంతలో తీయాలి.. అనే దాన్ని నేను, ప్రదీప్ కలిసి డిస్కస్ చేసుకున్నాం. మేం ఆఫీస్‌లోనే ఎక్కువగా చర్చించుకున్నాం. ప్రీ ప్రొడక్షన్‌లోనే మేం ఓ క్లారిటీతో ఉన్నాం. అలా కో ఆర్డినేషన్‌తోనే సిరీస్‌ని అనుకున్న ముందుగానే ఫినిష్ చేశాం.

దర్శకత్వ ఆలోచనలు..

కెమెరామెన్ టు డైరెక్టర్ అనేది అంత సులభమైన పని కాదు. డైరెక్షన్ అనేది చాలా రెస్పాన్సిబుల్ జాబ్. చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాక్కూడా కొన్ని ఆలోచనలున్నాయి. కానీ ఇప్పట్లో మాత్రం అటు సైడ్ వెళ్లను. ప్రస్తుతం నేను ఏఐ టెక్నాలజీని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను.

ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్‌లు..

‘ప్రేమకు నమస్కారం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. షణ్ముక్, శివాజీగారు, భూమికగారు ఇందులో న‌టించారు. అలాగే రాజీవ్ క‌న‌కాల‌గారు ప్ర‌ధాన పాత్ర‌లో ‘మ‌న డాక్ట‌ర్ బాబు’ అనే మ‌రో మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటోంది. మ‌రికొన్ని రెండు, మూడు సినిమాలు డిస్క‌ష‌న్ స్టేజ్‌లో ఉన్నాయి.

No comments