ఆర్. మాధవన్ 'జీ.డి. నాయుడు' ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన బయోగ్రాఫికల్ డ్రామా 'జీ.డి. నాయుడు' (GDN) ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. నటుడు-దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ మూలన్ నిర్మించారు.
భారతదేశపు ప్రముఖ శాస్త్రవేత్త, ఆవిష్కర్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (జీ.డి. నాయుడు) జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో మాధవన్ ఆయన పాత్రలో కనిపించనున్నారు. "ఎడిసన్ ఆఫ్ ఇండియా", "మిరాకిల్ మాన్", "వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్"గా పేరొందిన జీ.డి. నాయుడు జీవిత ప్రయాణం, ఆవిష్కరణలు, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది.
ఈ చిత్రంలో సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు.
'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' చిత్రంలో నంబి నారాయణన్ పాత్రతో ప్రశంసలు అందుకున్న మాధవన్, మరోసారి ఈ బయోపిక్ కోసం పూర్తిగా రూపాంతరం చెందారు. ఆయన లుక్, విభిన్న గెటప్స్, కాలానికి అనుగుణంగా రూపొందించిన సెట్స్, భారీ నిర్మాణ విలువలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.
ఇటీవల విడుదలైన తెలుగు ట్రైలర్‌కు ప్రేక్షకులు, సినీ విమర్శకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో 'జీ.డి. నాయుడు' ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
భారతదేశ సాంకేతిక రంగానికి విశేష సేవలందించిన మహానుభావుడు జీ.డి. నాయుడు స్ఫూర్తిదాయక జీవిత గాథను వెండితెరపై ఆవిష్కరించే ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments