Home/తెలుగు/నిజాయితీగా పని చేస్తే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ‘పెద్ది’ నిరూపించింది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు: ‘పెద్ది’ థ్యాంక్ యూ మీట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
నిజాయితీగా పని చేస్తే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ‘పెద్ది’ నిరూపించింది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు: ‘పెద్ది’ థ్యాంక్ యూ మీట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘థాంక్ యూ’ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ... ప్రేక్షకులు, అభిమానులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్యూ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఇష్టపడి, ప్రేమిస్తూ ఒక పని చేస్తూ ఇంకా చెప్పాలంటే నాకు తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమను పొందడం సర్ప్రైజింగ్ గా వుంది. ఇది ఎవరో పుష్ చేస్తే చేసిన సినిమా కాదు. బుచ్చిబాబు చెప్పిన కథను నమ్మి ఈ సినిమా చేసినందుకు నాకు ఎంతో సంతృప్తిగా ఉంది. దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా ప్రతి రోజు సినిమా కలెక్షన్లు పెరుగుతుండటం, ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ పెరుగుతుండటం చూస్తున్నాను. ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఫస్ట్ ప్రసాద్ ఐమాక్స్‌లో సినిమా చూశాను. అక్కడ మాస్ థియేటర్‌కు వచ్చేంత రియాక్షన్ కనిపించింది. నేను ఊహించని సన్నివేశాలకు కూడా చప్పట్లు కొట్టారు. సినిమా చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉందని చెబుతున్నారు. అలాంటి అనుభూతిని నాకు కలిగించిన మా టీమ్ అందరికీ ధన్యవాదాలు. నా సినీ లైబ్రరీలో నెంబరు 1, 2 గా నిలిచే సినిమా ఇది. మొదటిసారి కథ విన్నప్పుడు బుచ్చిబాబును హగ్ చేసుకున్నాను. కానీ ఇది ఎంత రిస్క్ అయిన కథ అనేది తర్వాత తెలిసింది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే, వాళ్లు ఈ సినిమాను స్వీకరించిన తీరు చూస్తుంటే, ఎవరైనా మనస్ఫూర్తిగా, నిజాయితీగా పని చేస్తే అది రేజర్ ఎడ్జ్ సినిమా అయినా, కమర్షియల్ సేఫ్ జోన్ సినిమా అయిన తప్పకుండా హిట్ కావాల్సిందే. అలాంటి విజయాన్ని మాకు అందించిన భారతదేశంలోని, విదేశాల్లోని ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలు. కుర్రాళ్లు, చిన్నపిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జగపతిబాబు గారు చెప్పినట్టే, ఒక సినిమాను కోట్లాది మందికి చేరవేసేది మీడియానే. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. జగపతిబాబు గారిని ఈ సినిమాలో చూస్తున్నప్పుడు నా కళ్లలో నీళ్లు వచ్చాయి. అంత అద్భుతంగా, అంత ఇన్‌స్పైరింగ్‌గా ఆయన పాత్రను పోషించారు. అలాగే శివరాజ్‌కుమార్ గారు, మిగతా నటీనటులందరికీ ధన్యవాదాలు. మేమంతా చాలా కష్టపడి, ఇష్టపడి ఈ సినిమా చేశాం. రెహమాన్ గారు తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మా పెర్ఫార్మెన్స్‌లను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత భారీ బడ్జెట్, ఇంత పెద్ద సబ్జెక్ట్ అయినా ఒక్కరోజు కూడా ఎలాంటి ఒత్తిడి తెలియనివ్వకుండా ఎంతో హ్యాపీగా సినిమా నిర్మించారు. 185 రోజుల షూటింగ్‌లో, దాదపు 165 రోజుల పాటు మా వెంటనే ఉన్నారు. ఆయనకు థ్యాంక్యూ సో మచ్. అనంత శ్రీరామ్ గారు రాసిన పాటలు జీవితాంతం నా ప్లేలిస్ట్‌లో ఉంటాయి. అంత ఇన్‌స్పైరింగ్ లిరిక్స్ రాశారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. అలాగే బాలాజీ గారికి కూడా థ్యాంక్యూ సో మచ్. పెద్ది లాంటి సినిమాకు నిజాయితీ అవసరం. ప్రేక్షకులు కూడా నిజాయితీగా థియేటర్‌కు రావాలంటే, మేము నిజాయితీగా పని చేయాలి. మా సినిమా కోసం అంత నిజాయితీగా పనిచేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జగపతిబాబు మాట్లాడుతూ... పెద్ది ఆడాడు... పోరాడాడు... గెలిచాడు. రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్లీ పోరాడాల్సి వచ్చింది. మళ్లీ గెలిచాడు. 300 కోట్లు, 400 కోట్లు అనేది పక్కన పెడితే, ఈ సినిమా ఎంత పెద్ద విజయం అనేది 300 రూపాయల టికెట్ కొన్న ప్రేక్షకుడే దాన్ని నిర్ణయిస్తాడు. ప్రేక్షకుల చేతిలో అంత పవర్ ఉంది. మనది అలాంటి వల్నరబుల్ ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీలో బుచ్చిబాబు ఒక మెగా పవర్ స్టార్‌కి ఈ కథ చెప్పడం, ఈ పాత్రను కన్విన్స్ చేయడం, చరణ్ దాన్ని నమ్మడం, దాన్ని తీయడానికి నిర్మాత ముందుకు రావడం మామూలు విషయం కాదు. కొంచెం అటు ఇటు అయినా ప్రేక్షకులు తిరస్కరించే అవకాశం ఉంది. అంత రేజర్ ఎడ్జ్ మీద నడిచిన సినిమా ఇది. చరణ్ ఈ సినిమాను నెత్తిన పెట్టుకుని మోశాడు. అందరినీ మెస్మరైజ్ చేశాడు. తను జస్ట్ మాన్ కాదు... సూపర్‌మ్యాన్, హీ-మ్యాన్. ‘పెద్ది’ సినిమా ఒక కల్ట్ మారిపోయింది. ఈ సినిమాకు ఆ రోజు, ఈ రోజు అనే తేడా లేదు. ఏ రోజైనా ‘పెద్ది’ రోజే. సినిమాకు దమ్ము ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చింది. రిలీజ్ ఈవెంట్‌లోనే ‘పెద్ది కొట్టేది ప్రతిదీ సిక్సరే’ అని చెప్పాను. అలాగే నా కెరీర్‌లో ఇదే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని కూడా చెప్పాను. అప్పుడు ఎక్కువ మాట్లాడానా అని భయపడ్డాను. కానీ ఇప్పుడు చూస్తుంటే నేను తక్కువే మాట్లాడాననిపిస్తోంది. సినిమా కలెక్షన్లు, స్పందన అన్నీ అదే చెబుతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ట్వీట్ చేస్తూ ‘నా బ్రదర్ జగపతిబాబు’ అన్నారు. అది నాకు ఆయన నుంచి వచ్చిన అతిపెద్ద కాంప్లిమెంట్. ఈ సినిమా వచ్చాక అందరూ ఊపిరి పీల్చుకుంటారని ముందే చెప్పాను. నిజంగానే ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సినిమా విజయం పట్ల చాలా ఆనందంగా ఉన్నాను. దీనిని మరింత పెద్ద విజయంగా చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. నాకు మరో అద్భుతమైన పాత్ర ఇచ్చిన బుచ్చిబాబుకి ధన్యవాదాలు. అలాగే నా ఫేవరెట్ హీరో చరణ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు.
డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ... ఈ సినిమాను ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఒక మంచి కథను చెప్పాలనే ఉద్దేశంతో నేను, చరణ్ గారు మీ ముందుకు వచ్చాం. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇది ఒక ఇన్‌స్పిరేషనల్ స్టోరీ, ఒక ఇన్‌స్పిరేషనల్ జర్నీ. ప్రధాని మోదీ గారు ప్రారంభించిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం కూడా నాకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. గ్రామాల్లో ఉన్న యువకులు తలచుకుంటే దేశానికి పతకాలు తీసుకురాగలరని అది నిరూపించింది. భారతీయ జీవన విధానంలో ఆట ఒక భాగం. ఒక వ్యవస్థలో మనిషికి గుర్తింపు ఎంత ముఖ్యమో చెప్పాలనుకున్నాం. తన ఊరి కోసం, తన గుర్తింపు కోసం ఒక వ్యక్తి ఎంత పోరాడతాడు అనేదే ఈ కథ. ఈ దేశంలో ఇప్పటికీ గుర్తింపు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు 18 వేల గ్రామాలు అలాంటి పరిస్థితిలో ఉన్నాయని నేను చదివాను. అలాంటి గ్రామాలన్నింటినీ భాగం చేయాలనే ఒక ప్రయత్నం చేశాను. ఇలాంటి ప్రయత్నానికి రామ్ చరణ్ గారు ముందుండి మద్దతు ఇచ్చారు. ఆయన సపోర్ట్‌ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ కథను నేను ఎంతగా నమ్మానో, చరణ్ గారు కూడా అంతే నమ్మారు. దానికి ఫలితమే గత నాలుగు రోజులుగా వస్తున్న అభినందనలు, ప్రశంసలు. చాలా మంది ‘మంచి సినిమా తీశారు’, ‘రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది’ అని మెసేజ్‌లు పెడుతున్నారు. అప్పలసూరి పాత్ర ఈ సినిమాకు చాలా ముఖ్యమైనది. జగపతిబాబు గారు అద్భుతమైన నటన కనబరిచారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు చివరి నాలుగు నిమిషాల్లో చాలా ఎమోషనల్ అవుతున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నేను ఏది ఫీల్ అయ్యానో అదే జరిగింది. హాస్పిటల్ సీన్ దగ్గర ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. చాలామంది నేషనల్ అవార్డు వస్తుందని అంటున్నారు. ఒక దర్శకుడిగా అంతకంటే పెద్ద ఆనందం ఉండదు. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన సతీష్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమా ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. హాలిడేస్‌లో అమ్మమ్మ ఇంటికి వెళ్లినట్లు, ‘పెద్ది’ ఆడుతున్న థియేటర్లకు కూడా వెళ్లి చూడండి. అందరికీ ధన్యవాదాలు.”
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ... రామ్ చరణ్ గారికి, సతీష్ గారికి, అందరికీ పేరుపేరునా నమస్కారం. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోపెద్ది రెండోసారి చూసినప్పుడు మొదటిసారి కలిగిన భావోద్వేగాలే మళ్లీ కలిగాయి. సినిమా అయిపోయాక చరణ్ గారు నడుచుకుంటూ వెళ్తుంటే, ‘అరే, ఆయన కాలికి బాగోలేదు కాదా?’ అనిపించింది. అంతగా పాత్రలో లీనమైపోయాం. ఆయన పెర్ఫార్మెన్స్ అంత ఇంపాక్ట్ ఇచ్చింది. చరణ్ గారు ఈ సినిమాను ఒంటికాలితో ముందుకు తీసుకెళ్లారు. జగపతిబాబు గారి పాత్ర దగ్గర నుంచే కథకు అసలు మలుపు మొదలవుతుంది. ఇది ఆయన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లలో ఒకటి. దర్శకుడు బుచ్చిబాబు అద్భుతమైన ఆలోచనతో వచ్చాడు. కొత్తదనం కోరుకునేవారికి, ఎమోషన్ ఇష్టపడేవారికి, కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకునేవారికి ‘పెద్ది’ అద్భుతమైన సినిమా. సోమవారం కూడా కలెక్షన్లు ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. అన్ని చోట్ల హౌస్‌ఫుల్స్ కనిపిస్తున్నాయి. ఇది ఒక సంక్రాంతి సినిమా లాగా దూసుకెళ్తోంది. తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీ పిల్లలకు తప్పకుండా ఈ సినిమా చూపించండి. గొప్ప స్ఫూర్తిని ఇచ్చే సినిమా ఇది. ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన రామ్ చరణ్ గారికి ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇది ఒక రిఫరెన్స్ పాయింట్‌గా నిలిచిపోతుంది. టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరికీ థ్యాంక్యూ. మీరు ఈ సినిమాను ఎంతగా ఆదరించారో మాటల్లో చెప్పలేను. ఫ్యామిలీస్, పిల్లలు మొదటి రోజు నుంచి నాలుగో రోజు వరకు అద్భుతంగా ఆదరిస్తున్నారు. సోమవారం కూడా కలెక్షన్లు ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. హిందీలో కూడా సినిమా మంచి స్పందన తెచ్చుకుంటోంది. రామ్ చరణ్ గారు ఈ సినిమాను ఒంటిచేత్తో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కష్టాన్ని తెలుగు ప్రేక్షకులు గుర్తించి ఆదరిస్తున్నారు. నా తొలి సినిమానే ఇంత పెద్ద విజయం సాధించడం చాలా గర్వంగా ఉంది. ఇది జీవితాంతం గుర్తుండిపోయే మెమొరబుల్ మూమెంట్. చరణ్ గారు తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. బుచ్చిబాబు కూడా ఎంతో కష్టపడ్డాడు. మైత్రి మూవీ మేకర్స్ సినిమాను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు. థియేటర్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. ‘మళ్లీ సంక్రాంతి వచ్చిందా?’ అని అందరూ మాట్లాడుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్లీ సక్సెస్ మీట్‌లో కలుద్దాం.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ... మేము 24 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నాం. ఎన్నో విజయాలు చూశాం. కానీ ‘పెద్ది’ వంటి గొప్ప సినిమా చేశామనే ఫీలింగ్ మాకు ఉంది. ఇది ఎప్పటికీ మా జీవితాల్లో నిలిచిపోయే సినిమా. ఈ సినిమా ప్రతి ఒక్కరి గుండెను తాకుతుంది. ఆట యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఈ తరం ఒత్తిడిని తట్టుకోవాలంటే ఆటలు ఎంత ముఖ్యమో చెబుతుంది. అలాంటి గొప్ప సబ్జెక్ట్‌ను రామ్ చరణ్ గారు అందరికీ చేరేలా చేశారు. ఆయన ఎఫర్ట్, ట్రాన్స్‌ఫర్మేషన్ ఈ తరం యువతకు ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్యామిలీస్‌తో కలిసి ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. అందుకే కలెక్షన్లలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు చాలా పెద్ద రన్ ఉంటుంది. సినిమాను ఆశీర్వదించిన ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలు. అందరూ థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూడండి. ఇది రామ్ చరణ్ గారి కెరీర్‌లోనే హయ్యెస్ట్ రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. ఇంకా ఎన్నో రికార్డులను అధిగమించి మరింత పెద్ద స్థాయికి చేరాలని కోరుకుంటూ, ఈ సినిమాను ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు, మెగా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
అనంత శ్రీరామ్ మాట్లాడుతూ... బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టి విజయ శిఖరాల వైపు దూసుకెళ్తున్న ‘పెద్ది’ చిత్ర బృందాన్ని అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా నమస్కారాలు. రామ్ చరణ్ గారు తనే శిల్పిగా, తనే శిల్పంగా మారి తనను తాను చెక్కుకున్నారు. ఆ శిల్పానికి తన నటనతో జీవం పోశారు. ‘పెద్ది’ విజయానికి ప్రధాన కారణమైన మా హీరో రామ్ చరణ్ గారికి నా నమస్కారాలు. ఆయన శరీరం రాయిలా దృఢంగా ఉన్నా, మనసు మాత్రం వెన్నలాంటిది. బుచ్చిబాబు గారు రూపొందించిన ఈ కథనం కత్తిలా పదునుగా ఉంది. ఇది ప్రతి దర్శకుడికి స్ఫూర్తినిస్తుంది. అలాగే కొత్త తరహా సన్నివేశాలతో, వందల మిలియన్ల వ్యూస్ సాధించే పాటలకు ప్రాణం పోసే అవకాశాన్ని ఇచ్చింది. ఇలాంటి సినిమాలు మాలాంటి సాంకేతిక నిపుణులకు మరింత స్ఫూర్తిని ఇస్తాయి
నిజాయితీగా పని చేస్తే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ‘పెద్ది’ నిరూపించింది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు: ‘పెద్ది’ థ్యాంక్ యూ మీట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
Reviewed by firstshowz
on
8:53 pm
Rating: 5
No comments