'కమిటీ కుర్రోళ్లు' జాతీయ అవార్డులు గర్వకారణం: నిర్మాత ఫణి అడపాక

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం (Best Telugu Film), ఉత్తమ మేకప్ (Best Makeup) విభాగాల్లో రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు దక్కడం పట్ల నిర్మాత ఫణి అడపాక ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "'సిద్ధార్థ్ రాయ్' చిత్రంతో నిర్మాతగా నా సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. తొలి సినిమాతో ఎన్నో విలువైన అనుభవాలను నేర్చుకున్నాను. అనంతరం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌తో కలిసి 'కమిటీ కుర్రోళ్లు'లాంటి హృదయాన్ని హత్తుకునే కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఇప్పుడు అదే చిత్రం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు విభాగాల్లో జాతీయ గుర్తింపు పొందడం నా జీవితంలో మరపురాని ఘట్టం. ఒక నిర్మాతగా ఈ గౌరవం అందుకోవడం ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. మా చిత్రాన్ని జాతీయ స్థాయిలో గుర్తించడం వెనుక పనిచేసిన ప్రతి ఒక్కరి కృషికి దక్కిన గొప్ప ఫలితం.

ఈ విజయానికి కారణమైన దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, మేకప్ విభాగంతో పాటు ప్రతి శాఖలో అంకితభావంతో శ్రమించిన యూనిట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ ప్రయాణంలో నాతో కలిసి నడిచిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ముఖ్యంగా, విడుదలైన తొలి రోజు నుంచే 'కమిటీ కుర్రోళ్లు' చిత్రాన్ని తమ సొంత సినిమాలా ఆదరించి, విజయవంతం చేసిన ప్రేక్షకుల ప్రేమాభిమానాలే ఈ జాతీయ అవార్డులకు నిజమైన బలం. ఈ గౌరవాన్ని ప్రేక్షకులందరికీ అంకితం చేస్తున్నాను.

ప్రస్తుతం ETV Win భాగస్వామ్యంతో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు రూపొందిస్తున్నాం. థియేటర్లతో పాటు ఓటీటీ వేదికల కోసం కూడా నాణ్యమైన, వినూత్నమైన కథలను అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం.

ఈ జాతీయ అవార్డులు మాపై మరింత బాధ్యతను ఉంచాయి. ఇకపై కూడా మంచి కథలను ఎంపిక చేస్తూ, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందించేందుకు కట్టుబడి ఉంటాం. తెలుగు సినిమా ఖ్యాతిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తామని" నిర్మాత ఫణి అడపాక తెలిపారు.

No comments