MRP – నీకెంత నాకెంత మూవీ రివ్యూ & రేటింగ్
పంచజన్య ఫీచర్స్ సమర్పణలోనరేష్ అగస్త్య హీరోగా నటించగా, డోనల్ బిష్ట్ జంటగా వెన్నెల కిషోర్, సుదర్శన్, కసిరెడ్డి రాజ్‌కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహా సింగ్ నటీ నటులుగా శ్రవణ్ జేష్ఠ స్వీయ దర్శకత్వంలో వస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘MRP – నీకెంత నాకెంత’..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూ లో చూద్దాం...
కథ
ఉద్యోగాలు చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతున్న ముగ్గురు స్నేహితులు మను (నరేష్ అగస్త్య), సుదర్శన్, కసిరెడ్డి రాజ్‌కుమార్ కలిసి సొంతంగా బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం గ్యాంగ్‌స్టర్ దైవాజీ వద్ద రూ.50 లక్షలు అప్పు తీసుకుంటారు. అయితే వారు మొదలుపెట్టిన వ్యాపారం అనుకున్న విధంగా సాగకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు.
ఇదే సమయంలో మను తన ప్రేయసి అమృత (డోనల్ బిష్ట్)తో కూడా విభేదాల కారణంగా దూరమవుతాడు. అప్పు తీర్చేందుకు ముగ్గురు స్నేహితులు వేసిన ప్లాన్ అనుకోని మలుపులు తిరిగి వారిని పెద్ద సమస్యల్లోకి నెట్టేస్తుంది. చివరికి వారు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు? మను తన ప్రేమను తిరిగి గెలుచుకున్నాడా? తీసుకున్న అప్పును తీర్చగలిగారా? అనే ప్రశ్నలకు సమాధానమే 'MRP – నీకెంత నాకెంత'.
నటీనటుల పెర్ఫార్మెన్స్స్
నరేష్ అగస్త్య మరోసారి తన ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకున్నారు. కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మంచి నటన కనబరిచారు.
డోనల్ బిష్ట్ తన పాత్రకు తగ్గ అందం, అభినయంతో ఆకట్టుకుంది.
వెన్నెల కిషోర్, సుదర్శన్ కలిసి పండించిన కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
కసిరెడ్డి రాజ్‌కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహా సింగ్ తమ పాత్రల పరిధిలో చక్కగా నటించి కథకు బలం చేకూర్చారు.
సాంకేతిక విభాగం
దర్శకుడు శ్రవణ్ జేష్ఠ కథను కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మలచడంలో మంచి ప్రయత్నం చేశారు.
రాకేష్ కొలాంచి సినిమాటోగ్రఫీ విజువల్స్‌కు మంచి లుక్ తీసుకొచ్చింది.
అజయ్ అరసాడ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాలను మరింత ప్రభావవంతంగా చేసింది.
మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ రెండో భాగంలో బాగున్నప్పటికీ, ఫస్ట్ హాఫ్‌ను మరింత క్రిస్ప్‌గా ఉంచి ఉంటే ఇంకా బాగుండేది.
నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
విశ్లేషణ
దర్శకుడు శ్రవణ్ జేష్ఠ కామెడీ, క్రైమ్, థ్రిల్లర్ అంశాలను కలిపి యూత్‌ను ఆకట్టుకునేలా కథను తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. కథ కొత్తదిగా అనిపించకపోయినా, స్క్రీన్‌ప్లేలో వచ్చే ట్విస్టులు, హాస్య సన్నివేశాలు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తాయి.
ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, కథ సెటప్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల కథనం కొద్దిగా నెమ్మదిగా అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత సినిమా వేగం పుంజుకుని కామెడీ, థ్రిల్, ఎమోషన్స్‌తో ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను సంతృప్తిపరుస్తుంది.
ఫైనల్‌గా
'MRP – నీకెంత నాకెంత' పూర్తిగా కొత్త కథ కాకపోయినా, కామెడీ, థ్రిల్లర్, ఫ్రెండ్‌షిప్, ఎమోషన్స్‌ను కలిపిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ – సుదర్శన్ కామెడీ, నరేష్ అగస్త్య పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఈ వీకెండ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులకు ఇది మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.
రేటింగ్: 3.5/5

No comments