అవయవ దానంతో ఆదర్శంగా నిలిచిన దీప్తి రెడ్డి

హైదరాబాద్, 26-9-2026: వ్యాపారవేత్త మడుగుల దీప్తి రెడ్డి రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా, వైద్యులు తాజాగా ఆమెను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు అవయవ దానానికి సమ్మతి తెలపడంతో, విరాట్ ఫౌండేషన్ సహకారంతో జీవన్‌దాన్ ద్వారా అవసరమైన అధికారిక ప్రక్రియను వైద్యులు చేపట్టారు.

దీప్తి రెడ్డి 2026 జూన్ 18న అవయవ దానానికి ప్రతిజ్ఞ చేసిన సందర్భంగా తీసిన చిత్రాన్ని విరాట్ ఫౌండేషన్ అధ్యక్షుడు యష్ వీరగోని పంచుకున్నారు.

తీవ్రమైన దుఃఖ సమయంలోనూ దీప్తి రెడ్డి ఆకాంక్షను గౌరవిస్తూ అవయవ దానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యుల నిర్ణయం ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు.

“ఒక కుటుంబానికి ఇది తీరని లోటు. కానీ మరికొంతమంది జీవితాల్లో వెలుగునింపే నిర్ణయానికి ముందుకొచ్చిన దీప్తి రెడ్డి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అవయవ దానం ద్వారా ఇతరులకు జీవితం అందించడం సమాజానికి గొప్ప సందేశం” అని యష్ వీరగోని తెలిపారు.

అవయవ దానంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలని, మరెందరో ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విరాట్ ఫౌండేషన్ కోరింది.

No comments